అందుకే కలిశాం; 'మహా' ట్విస్ట్‌పై వివరణ
సాక్షి, ముంబై: మహారాష్ట్రకు కావాల్సింది సుస్థిరమైన ప్రభుత్వమని, కిచిడి ప్రభుత్వం కాదని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమ బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన మాట తప్పిందని ఆరోపించారు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నించడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు. ఎన్సీపీతో కలిసి సుస్థిర పాలన అందిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర పాలన ఏర్పాటుకు తమతో కలిసి వచ్చిన అజిత్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరికొంత మంది నాయకులు కూడ తమతో చేతులు కలపడంతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామని ఫడ్నవీస్ వెల్లడించారు.