‘ఏపీలో పోలీసులకు బీమా పెంపు’

'ఏపీలో పోలీసులకు బీమా పెంపు'


సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న' పోలీసు సంక్షేమ నిధి' నుంచి గ్రూపు ఇన్సూరెన్స్‌ విలువను భారీగా పెంచినట్లు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. పోలీసు బీమా మరింతగా పెరిగిందని.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌లో పెరుగుదల కనిపించిందని సీఎం జగన్‌ అన్నారు. గతంలో కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా.. ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచామని ఆయన అన్నారు. అలాగే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నామని తెలిపారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కింద చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.